వరకట్న హత్య కేసులో ముద్దాయికి 11 సం||లు ఖైదు - వల్లంపూడి ఎస్.ఐ కె. రాజేష్


విజయనగరం జిల్లా ఎంబిసి: వల్లంపూడి పోలీసు స్టేషనులో 2016లో నమోదైన వరకట్నం వేధింపులు, హత్య నేరం కేసులో నిందితుడు కశిరెడ్డి సన్యాసి నాయుడుకి 11 సం॥లు జైలు శిక్ష మరియు రూ. 5,000/- జరిమానా విధిస్తూ సెప్టెంబరు 1న విజయనగరం 1వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి జి. రజని తీర్పును వెల్లడించారు. ఈ కేసులో పోలీసు వారి తరుపున పబ్లిక్ ప్రోసిక్యూటర్గా మెట్ట ఖజానారావు వాదనలు వినిపించారు.

వివరాల్లోకి వెళ్ళితే... నిందితుడు కశిరెడ్డి సన్యాసినాయుడు తన తల్లిదండ్రులతో కలిసి విజయనగరం జిల్లా వేపాడ మండలం, ఆతవ గ్రామంలో నివాసం ఉంటున్నారు. నిందితుడు కశిరెడ్డి సన్యాసి నాయుడుకు విశాఖపట్నం జిల్లా, కె.కోటపాడు మండలం, సూదివలన గ్రామానికి చెందిన పార్వతితో 2013, మే నెలలో వివాహం జరిగింది. వీరికి ఒక పాప జన్మించింది. కొన్నాళ్ళు తరువాత పార్వతి భర్త కశిరెడ్డి సన్యాసినాయుడు అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, ఆమె కన్నవారింటికి వెళ్ళగొట్టారు. తరువాత ఆమెను బాగా చూసుకుంటానని నమ్మించి కన్నవారింటి నుండి తిరిగి కాపురంకు తీసుకొని వచ్చాడు. కాని, నిందుతుడు మరలా అదే విధంగా అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో, తన భర్త సన్యాసినాయుడులో ప్రవర్తనలో ఎటువంటివంటి మార్పు రాకపోవడంతో మనస్థాపం చెంది పార్వతి (మృతురాలు) తేది. 10-03-2016న ఇంటిలో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయింది. ఈ విషయమై ఆమె తల్లి వర్రి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి వల్లంపూడి ఎస్ఐ ఎం.కృష్ణమూర్తి వరకట్న వేధింపులు, హత్యా నేరం క్రింద కేసు నమోదు చేశారు. అప్పటి విజయనగరం డిఎస్పీ టి.వెంకట రత్నం దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందుతుడు కశిరెడ్డి సన్యాసి నాయుడుపై నేరారోపణలు రుజువు కావడంతో నిందుతుడుకి 11 సం||లు కఠిన కారాగార శిక్ష మరియు రూ.5,000/- లు జరిమానా విధిస్తూ విజయగనరం 1వ అదనపు సెషన్సు కోర్టు న్యాయమూర్తి శ్రీమతి జి.రజిని సెప్టెంబరు 1న తీర్పును వెలువరించినట్లుగా వల్లంపూడి ఎస్ఐ. కె.రాజేష్ తెలిపారు.

0 Comments