ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్న మహిళ..


సాధారణంగా కొంతమంది మగాళ్లు ఈజీ మనీ కోసం నిత్య పెళ్లి కొడుకులా మారతారు. కానీ ఇక్కడ ఒక మహిళ సులువుగా డబ్బు సంపాదించడం ఎలా అని ఏదైనా కోర్సు చేసిందేమో ఏకంగా నిత్య పెళ్లికూతురు అవతారం ఎత్తింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన రోకళ్ల వెంకటలక్ష్మి అలియాస్ గుంటూరు కందుకూరి నాగలక్ష్మి ఒకరిద్ధరిని కాదు, ఏకంగా ఏడుగురిని పెళ్లి పేరుతో మోసం చేసింది. ఈ విషయాన్ని ఆమె చేతిలో మోసపోయిన బాధితుడు కొత్తకోట నాగేశ్వరరావు (శివ) తెలిపాడు. గుంటూరు, భీమవరం, విజయవాడ ప్రాంతాలకు చెందిన 7 గురు వ్యక్తులను మోసం చేసింది. డబ్బున్న వాళ్ళని గుర్తించి, మాయ మాటలు చెప్పి వలలో వేసుకోవడం, పెళ్లి చేసుకుని తాత్కాలిక భర్త నుండి డబ్బులు తన అకౌంట్లో వేయించుకోవడం, ఆ సొమ్ముతో స్థలాలు, భూములు కొనడం వంటివి చేస్తుంది.

ఈ క్రమంలోనే కొత్తకోట నాగేశ్వరరావుకి మాయ మాటలు చెప్పి వివాహం చేసుకుని.. ప్రతీ నెలా వచ్చిన జీతాన్ని ఆమె అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేది. అంతేకాదు ఆయన తండ్రి నుంచి వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరంట్ల వద్ద ఉన్న ఇంటిని, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ఉన్న 12 సెంట్ల ఖాళీ స్థలాన్ని కూడా ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించుకుంది. మొదట్లో తన వద్ద పనిలో చేరిందని, ఆ తర్వాత దగ్గరయ్యిందని.. దీంతో 2021 మార్చి 13న గుంటూరులో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. అనంతరం ఇద్దరూ విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. నాగేశ్వరరావు ఓ కంపెనీలో ఆడిటర్ గా పని చేస్తున్నారు. భార్యలా నటిస్తూ తన జీతంతో పాటు ఇంటిని, స్థలాన్ని కూడా కాజేసిందని వాపోయాడు. 6 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పి 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బు తీసుకుని వెళ్లిపోయిందని బాధితుడు భీమవరం, గుంటూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఆమె గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భీమవరంలో ఇద్దరు, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒకరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదానగర్ లో ఒకరు, గుంటూరు డొంక రోడ్డులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని మోసం చేసినట్లు తెలిసింది. నాగేశ్వరరావుతో కలిపి మొత్తం ఏడుగురి కొంప ముంచింది రోకళ్ల వెంకటలక్ష్మి అలియాస్ గుంటూరు కందుకూరి నాగలక్ష్మి. ఇలా ఎక్కడపడితే అక్కడ అకౌంట్లు ఓపెన్ చేసి.. తన బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేసుకుని.. ఇల్లు, స్థలాలు తన పేరు రాయించుకుని జంప్ అవుతుంది. ఇన్నాళ్ళకి ఆమె నిర్వాకం బయపడడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

0 Comments