మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు - విజయనగరం జిల్లా ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహనరావు

ప్రత్యేక డ్రైవ్తో వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లుకు ఈ చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

తల్లిదండ్రులు, వాహనదారుల సమక్షంలో మైనర్లుకు కౌన్సిలింగు నిర్వహించిన ట్రాఫిక్ డిఎస్పీ


విజయనగరం MBC; పట్టణంలో మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహనరావు ఆగస్టు 12, శుక్రవారం నాడు హెచ్చరించారు. లైసెన్సు లేకుండా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం. దీపిక ఐపిఎస్ గారి ఆదేశాలతో విజయనగరం పట్టణంలోని బాలాజీ జంక్షన్ లో విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు మరియు ఎస్ఐ భాస్కరరావు, ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనాలు తనిఖీలు చేపట్టగా కొంత మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులు, వాహన యజమానుల వివరాలు సేకరించి, వారిని పిలిపించి, వారి సమక్షంలో కౌన్సిలింగు నిర్వహించి ఇ-చలానాలు విధించారు. ఇటీవల కాలంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా మైనర్లు మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. వాహనాలు నడిపేందుకు తప్పనిసరిగా డ్రైవింగు లైసెన్సు ఉండాలన్నారు. డ్రైవింగు లైసెన్సు లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే బాధితులకు, వాహనదారులకు ఎటువంటి ఇన్సూరెన్సు వర్తించదన్నారు. ట్రాఫిక్ రూల్స్, భద్రతా నియమాల పట్ల అవగాహన లేని మైనర్లు మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ, ట్రిపుల్ రైడింగు చేస్తూ, ప్రమాదాలకు కారణమవుతూ, కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతూ, తమ తల్లిదండ్రులకు పుత్రశోఖం మిగుల్చుతున్నారన్నారు. లైసెన్సు లేకుండా మైనర్లును డ్రైవింగుకు అనుమతించడం కూడా చట్టరీత్యా నేరమని, ఇకపై వాహనదారులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించి లైసెన్సు లేనిమైనర్లుకు, తమ పిల్లలకు వాహనాలను ఇవ్వవద్దని కోరారు.


0 Comments