త్వరలోనే సౌరవ్ గంగూలీ సంచలన నిర్ణయం


ఇండియన్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)ది ప్రత్యేకమైన స్థానం. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) మాదిరి భారీ రికార్డులు సాధించలేకపోయినా.. తనదైన శైలిలో టీమిండియా (Team India)లో తన ముద్రను వేశాడు. ఫిక్సింగ్ వార్తలతో టీమిండియా పరువు పోయిన వేళ.. గంగూలీని 2000వ సంవత్సరంలో కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అక్కడి నుంచి టీమిండియా క్రకెట్ ను మరో మెట్టుపైకి తీసుకెళ్లాడు గంగూలీ. ఆస్ట్రేలియా ,ఇంగ్లండ్ జట్ల ఆధిపత్యానికి గండి కొట్టేలా గంగూలీ టీమిండియాను ముందుండి నడిపించాడు. తన హయాంలోనే యువరాజ్ సింగ్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా లాంటి మ్యాచ్ విన్నర్లను టీమిండియాలోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం బీసీసీఐ బాస్ గా ఉంటున్న సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే సౌరవ్ గంగూలీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

‘‘1992లో క్రికెట్‌తో నా ప్రయాణం ప్రారంభమైన 2022 నాటికి 30 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి మద్దతును అందించింది. ఈ ప్రయాణంలో భాగమైన వాళ్లు, మద్దతుదారులు, నేను ఇక్కడి వరకు రావడంలో సాయపడిన వాళ్లు అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా. ఈరోజు మరింత మందికి సహాయం అందిస్తుందనిపించే ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నా. జీవితంలో ఈ కొత్త దశలోకి అడుగుపెట్టే సమయంలో మీ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ తో ఆయన రాజకీయాల్లో చేరతారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలి కాలంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్‌షాతో గంగూలీ రెండుసార్లు భేటీ అవడం కూడా ఈ వదంతులకు కారణం అవుతోంది. దాదా త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని, బీజేపీ తరఫున పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గంగూలీ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలయాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

దాదా ట్వీట్ నేపథ్యంలో జాతీయ మీడియాలో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంది గంగూలీ తప్పుకుంటున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేయలేదని ఆయన తెలిపారు.

0 Comments